హైదరాబాద్ కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో రేవంత్ రెడ్డి సర్కారుకు ఊహించని షాక్ తగలింది. గచ్చిబౌలి భూములు గురించి కొద్దిరోజులుగా మీడియాలో వస్తున్న కథనాలను పరిశీలించిన సుప్రీంకోర్టు ఈ ఇష్యూ ను సుమోటోగా తీసుకుని విచారణ జరిపింది. ఇదే సమయంలో కొన్ని సామాజిక స్వచ్ఛంద సంస్థలు సుప్రీంకోర్టు కంచ గచ్చిబౌలి 400ఎకరాల్లో జరుగుతున్న విధ్వంసం మీద వేసిన పిటీషన్లను కూడా పరిగణనలోకి తీసుకుంది. జస్టిస్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఈ భూముల వివాదంపై విచారణ జరిపింది. ఈ ఒక్కరోజే మొత్తం రెండు దఫాలుగా విచారణ చేసింది సుప్రీంకోర్టు. ముందు తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ ను హెచ్ సీయూకి వెళ్లి అక్కడ జరుగుతున్న పనులు ఏంటీ ఓ రిపోర్ట్ తయారు చేసి మధాహ్నం 3.30 గంటల్లోపు నివేదిక పంపాలని ఆదేశించింది. అప్పటివరకూ హెచ్ సీయూలో జరుగుతున్న పనులను తక్షణం ఆపాలని ఒక్క చెట్టును నరికినా ఊరుకునే ప్రసక్తే లేదని సంచలన ఆదేశాలు జారీ చేసింది.